నమస్కారం! What are you looking for?‎


Tuesday 29 September 2020

"జూలు విదిలించిన సింహం"

 


GPS జూలో ఒక సింహం ఉండేది. రోజూ చాలామంది జనాలు వచ్చిపోయేవారు. కానీ, ఈమధ్యకాలంలో రాన్రాను జనాలు రావడం బాగా తగ్గింది. దాంతో సింహానికి పెట్టె ఆహారం కూడా తగ్గించారు.

ఒకరోజు అయితే పూర్తిగా జనాలే రాలేదు. సింహానికి పెట్టే ఆహారం ఇంకా తగ్గించేశారు. ఎందుకిలా జరుగుతుంది అని కనుక్కుంటే వైరస్ వల్ల ప్రపంచానికే విపత్తు సంభవించిందని తెలిసింది.

రెండురోజుల తరువాత సింహాన్ని, వేరే చిన్న బోనులోకి మార్చి, ఒక పెద్ద బండి లోకి ఎక్కించారు. ఆ బండి GPS జూ నుండి బయలుదేరింది. రోడ్లంతా నిర్మానుష్యంగా ఉన్నాయి. తనను ఎక్కడికి తీసుకుని పోతున్నారో సింహానికి తెలీలేదు.

కొన్ని గంటల ప్రయాణం తరువాత, అడవి మధ్యలో ఒక గుట్ట దగ్గరకు చేరుకున్నారు. సింహాన్ని బోనులోనుండి బలవంతంగా కిందికి దింపారు. మామూలుగా పెట్టే మాంసానికన్నా కొంచెం ఎక్కువ మాంసాన్ని గిన్నెలో వేసి, కొద్ది దూరంలో పెట్టారు.

ఈ మధ్యకాలంలో పెట్టే ఆహారం తగ్గించడంవల్ల, అంతమాంసాన్ని ఒక్కసారిగా చూసిన సింహం, తినడం మొదలుపెట్టింది.

మాంసం తింటుండగా దాన్ని తీసుకొచ్చిన బండి బయలుదేరడం సింహం గమనించింది. తినడం మధ్యలో ఆపేసి బండి వెనక పరిగెత్తడం మొదలుపెట్టింది. అయినా బండి ఆగకుండా వెళ్ళిపోయిది.

చాలాదూరం, బండిని వెంబడించిన సింహం, ఇక చేసేదేమీలేక వెనక్కి గుట్టదగ్గరకు తిరిగివచ్చి, ఖాళీగిన్నెను చూసి ఆశ్చర్యపోయింది.

సాయంత్రం కావస్తోంది. ఒకపక్క ఆకలి, మరోపక్క చలి. పడుకునేందుకు బోనుకోసం సింహం అడవంతా వెతికింది. చీకటి పడిన తరువాత, సింహానికి ఒక గుహ కనపడింది.

గుహలో విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో సింహానికి తనగతం గుర్తొచ్చింది.

తను పుట్టి పెరిగింది జూలో కావడంతో మనుషులంటే జంకు లేకుండా ఉండేది. చిన్న పిల్లలనుండి, పెద్దవారివరకూ, అన్ని వయసులవారు తనను చూడడానికి వచ్చేవారు. తనకు కావసినంత ఆహారం పెట్టేవారు. అని ఆలోచిస్తూ సింహం నిద్రపోయింది.

పొద్దెక్కేవరకూ సింహం బాగా అలసిపోయి నిద్రపోతూండగా, గర్ ర్ ర్ అని శబ్ధం వినపడింది. కళ్లు తెరిచి చూస్తే, ఎదురుగా ఎలుగుబంటి నిలబడిఉంది.

వెంటనే సింహం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది.

కాసేపు అడివంతా తిరిగిన తర్వాత,, తనను ఎవరైనా తీసుకెళ్లడానికి వచ్చారేమోనని గుట్ట దగ్గరకు వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఎండకు సింహం ఒక చెట్టు కింద కూచుంది.

కొద్దిసేపటికి పొదల్లో ఒక కుందేలు కనపడింది వేటాడడం అలవాటు లేకపోయినా సింహం, అసంకల్పితంగా కుందేలుపై ఒక్కసారిగా దూకి, చంపి తిని, తన ఆకలి తీర్చుకుంది.