నమస్కారం! What are you looking for?‎


Monday 12 October 2020

పాత జోళ్ళు కొత్త బూట్లు



సాయంత్రం తండ్రి కొడుకులు ఇద్దరూ తిరణాలకు పోయారు. అక్కడ శీనుగాడికి ఎర్ర బూట్లు కనిపించాయి. అవి కావాలని తండ్రిని శీనుగాడు మారాం చేసి మరీ కొనితెచ్చుకున్నాడు.

ఆ రోజంతా శీనుగాడు ఎర్ర బూట్లు వేసుకొని అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఆ బూట్లు చప్పుడు తిరునాళ్ళలో డప్పు దరువులా టక్కు టిక్కు అంటుంటే ఎంతో సంతోషపడ్డాడు.

ఆ మరుసటి రోజు పుస్తకాలు సంచిలో పెట్టుకుని, సీసాల్లో నీళ్లు పోసుకుని, అమ్మని అడిగి తాయిలం తీసుకుని చెప్పుల స్టాండ్ వైపు చూశాడు. చెప్పుల స్టాండ్ కే అందం తెచ్చిన ఎర్రబూట్లు తొడుక్కుని బడికి బయలుదేరాడు.

దారిలో పిల్లలంతా బూట్ల శబ్దాన్ని విని, శీనుగాడిని "నీ బూట్లు బాగున్నాయి. ఎంత? ఎక్కడ కొన్నావు?" అని అడిగిన ప్రతి ఒక్కరికి జవాబు చెప్పుకుంటూ బడికి పోయే సరికి బడి గంట కొట్టారు. పిల్లలంతా తరగతిగది లోపలికి పరిగెత్తారు.

"రేయ్ శీనుగా బూట్లు బయట ఇప్పి రా రా" అనింది టీచర్. టీచరు శీనుగానికి ఇష్టమైన తెలుగు పాఠం చెప్తూ ఉన్నా, వాడి ధ్యాస బయట ఉన్న తన ఎర్ర బూట్ల పైనే ఉంది.

తరగతి ఎంత అల్లరిగా ఉన్నా బూట్ల టక్కు టిక్కు శబ్దం శీనుగాడు మర్చిపోలేకున్నాడు.

ఇంతలో ఇంటర్వెల్ గంట కొట్టారు. పిల్లలందరూ పొయ్యి వచ్చేసరికి, శీనుగాడు ఇంకా బూట్లు విప్పుతూ నే ఉన్నాడు.

ఇలా నాలుగైదు రోజులు గడిచాయి,

ఎప్పుడూ లేనిది, వేణుగాడు "రేయ్ శీనుగా నీ దగ్గర ఏదో వాసన వస్తోంది రా" అన్నాడు. శీను గాడికి కూడా వాసన వస్తోంది. చిన్నగా లేచి, సోము గాడి పక్కన కూర్చున్నాడు. కాసేపటికి, సోము కూడా అదే మాట అన్నాడు.

ఆ రోజు సాయంత్రం శీను ఇంటికి వచ్చిన తర్వాత, కాళ్లు కడుక్కునేందుకు బూట్లువిపాడు. కాళ్ళంతా పాసిపోయాయి  కాళ్ళ వేళ్ళ సందుల్లో అంతా పుండ్లు, భయం వేసి అమ్మకు చూపించాడు. అమ్మ పసుపు నీళ్లతో కాళ్లు కడిగించింది.

మరుసటి రోజు పుస్తకాలు సంచి లో పెట్టుకొని, సీసాలోకి నీళ్లు పోసుకుని, అమ్మని అడిగి తాయిలం తీసుకొని, చెప్పుల స్టాండ్ వైపు చూశాడు. చెప్పుల స్టాండ్ కే అందం తెచ్చిన ఎర్ర బూట్ల పక్కన ఉన్న తన పాత జోళ్ళను వేసుకుని బడికి బయల్దేరాడు.