నమస్కారం! What are you looking for?‎


Tuesday 13 October 2020

దోమ పోయి ఈగతో మొరపెట్టుకొన్నట్లు



ఆపసోపాలు పడుతూ నీరసించిపోయిన ఒక దోమ చీకటిగా ఉన్న మూల కు చేరింది.

అంతకంటే నీరసించిన, ఎగరలేని ఈగ ముందుగానే అక్కడ ఉంది. "ఏంజరిగింది"? అంది, ఈగ.

ఏమి చెప్పమంటావు ఈగమ్మా, "మమ్మల్ని దోమలు అని చదువుకున్న వాళ్ళు ,పట్నం వాళ్ళుతప్ప అందరూ చీకటీగలు "అనే అంటారు కదా! 

"ఆ ! అవునవును". అంది ఈగ.

చీకటి పడితే చాలు, మాకు పండుగే, పండుగ. కుట్టినచోట కుట్టకుండా, బాబోయ్! చీకటీగలు అంటే భయం. అనేటట్టు, ఆరుబయట ఆడకండి,అని కేకలు వేసేటట్టు,

ఒక వేళ నిర్లక్ష్యంగా ఉంటే, కుట్టి కుట్టి,నెల నాళ్ళు మంచాన పడేసే "మలేరియానో",కాళ్లు, చేతులు వంగకుండా చేసే "చికెంగున్యానో" టయానికి తిండి తినకుండా చేసే "డెంగ్యూ నో",మనుషులకి ఇచ్చి, అబ్బా!దోమలు అని అదిరిపోయే, పేరున్న దోమలమా"?

మేము, మమ్మల్ని చంపాలనుకునే పెద్దల,పిల్లల చేతుల్లోకి వచ్చినట్లే వచ్చి,చటుక్కున జారిపోయి,వాళ్ల చేతుల్ని వాళ్లే కసిదీర కొట్టుకుని, అబ్బాఅంటూ ఉంటే, మేము పొట్ట ఉబ్బిపోయేటట్లు నవ్వుకునే వాళ్ళం.

ఇంక మా చేతుల్లో ఏమీ లేదని,"ఆల్ అవుట్","మస్కిటో కాయిల్లు" తెగ వాడారా, ఇంకా మా ఇమ్యూనిటీ పెరిగిపోయింది.

ఆల్ అవుట్ ల మీదే మేము డాన్స్ చేసే వాళ్ళం. సోష వచ్చి పడిపోయినట్లు నటిస్తూనే దగ్గరికి వచ్చిన వాళ్ళ పని పట్టేసే వాళ్ళం.

కానీ, నీకు తెలుసు కదమ్మా!"మనకు వేపాకు పొగ పడదని", ఆ చిన్ని, అందరికీ ఈ విషయం చెప్పి, రోజూ అందరి ఇళ్లలో వేపాకు ధూపం, వేపనూనె దీపం పెట్టిస్తోంది. ఆ ఘాటుకు మా వాళ్ళందరూ ఏమయ్యారో, నేను మాత్రం తప్పించుకున్నా.

మరి, నీ సంగతి ఏంటమ్మా? 

అయ్యో రామ! "ఈగలు అంటేనే,పాచి అన్నం పాత్రలు, కుళ్ళిపోయిన కూర పాత్రలు, దిబ్బలు, చెత్తాచెదారం" మా ఇళ్లని నీకు తెలుసు కదా"!

ఆ మధ్యన, స్వచ్ఛభారత్ అంటూ అన్నీ చెత్తాచెదారం లేని ఊళ్లుఅయ్యాయి. 

రంగిఇంట్లో, రత్తమ్మ ఇంట్లో ఉండే పాచి పాత్రల్లో, మహా సుష్టుగా భోంచేసి, అక్కడే గుడ్లు పెట్టి హాయిగా ఉండేదాన్ని. ఒకానొక సమయంలో, నేను ఎగరడం కూడా మర్చిపోయాను. చిన్నగా నడుస్తూ, ఈ పాత్ర నుండి ఆ పాత్ర లోకి వెళ్లి తినేదాన్ని.

ఈ కరోనా మహమ్మారి, మనకన్నా జబ్బట, అందుకే అందరూ శుభ్రత, పరిశుభ్రత అంటున్నారు. మురుగునీరు లేదు, కుళ్ళిన కూర లేదు, వెతికి వెతికి వేసారి ఆకలితో నీరసించి, ఈ మూల చేరాను.

అంటున్న వారి మాటలకు, చిన్న మూలుగు వినపడింది. ఉలిక్కిపడ్డ ఈగా, దోమా అమ్మో! సాలీడు అని, అధిరిప డ్డాయి. భయంతో, వణికిపోయాయి. రెక్క లల్లార్చాయి. సాలీడు గూటిలో పడ్డాయేమోనని.

అయ్యో! భయపడకండి, నాదీ మీ పరిస్థితే నా ఎనిమిది కాళ్ళ లో, మూడు కాళ్ళు విరిగిపోయాయి. మీరన్నా, ఓపిక వస్తే రెక్కలల్లారుస్తూ, ఎగిరి పోతారు. నా సంగతి చెప్పలేను అంది.

ఆ చింటుగాడు పరిశుభ్రత గురించి బాగా వంట పట్టించుకున్నాడు. రాత్రంతా కష్టపడి కట్టిన నా గూడును, ఉదయాన్నే తీసేస్తాడు. పగలంతా కట్టిన దాన్ని రాత్రి అవ్వగానే తీసేస్తాడు. గూడు కట్టి, కట్టి నాలో శక్తి క్షీణించి పోయింది. ఏమాత్రం ఆహారం లేదు. మళ్లీ గూడు కట్టే ఓపిక లేదు,

 అంటుండగానే ,చింటుగాడు దోమలబ్యాట్ తో మూలకు వచ్చాడు. అమ్మో! అంటూ, భయంతో కేకలు పెడుతూ, మూడూ తలో దిక్కు పారిపోయాయి. దూరంగా ఎక్కడైనా చెత్తాచెదారం, మురుగు దొరక్కపోతుందా, అనే ఆశతో......